14 ఏళ్లకే SATలో సెన్సేషన్.. 1600/1600 స్కోర్ సాధించిన తెలుగు బాలుడు!
14 ఏళ్లకే SATలో పర్ఫెక్ట్ స్కోర్.. తెలుగు బాలుడి అసాధారణ ప్రతిభ!
జార్జియాకు చెందిన తెలుగు బాలుడు అశ్రిత్ తాళ్లూరి చిన్న వయసులోనే అసాధారణ ప్రతిభ కనబరిచాడు. సాధారణంగా హైస్కూల్ చివరి దశలో విద్యార్థులు రాసే SAT పరీక్షలో 1,600కి 1,600 పర్ఫెక్ట్ స్కోర్ సాధించి ప్రత్యేక గుర్తింపు పొందాడు.
అశ్రిత్ ఫుల్టన్ కౌంటీలోని Innovation Academyలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. అంతకుముందే మిడిల్ స్కూల్‌లో 14.5 హైస్కూల్ క్రెడిట్లు పూర్తి చేశాడు. ప్రస్తుతం డ్యూయల్ ఎన్‌రోల్‌మెంట్ ద్వారా రెండు కాలేజ్ స్థాయి కోర్సులను కూడా అభ్యసిస్తున్నాడు.
ఐదు నెలల కఠినమైన సిద్ధత
SAT కోసం అశ్రిత్ సుమారు ఐదు నెలల పాటు ప్రత్యేకంగా సిద్ధమయ్యాడు. ట్యూటర్ సహాయం తీసుకోవడంతో పాటు ఆన్‌లైన్ స్టడీ మెటీరియల్‌ను ఉపయోగించాడు. 20కి పైగా ప్రాక్టీస్ టెస్టులు పూర్తి చేయగా.. అధికారిక పరీక్షకు ముందే మూడు ప్రాక్టీస్ SATల్లో 1,600 స్కోర్ సాధించినట్లు FOX 5 వెల్లడించింది.
జూన్‌లో అధికారిక SAT పరీక్ష రాసిన అనంతరం ధ్రువీకరణ ప్రక్రియ పూర్తయింది. చివరకు ఫలితాలు విడుదల కాగా అశ్రిత్ 1600/1600 స్కోర్ సాధించినట్లు నిర్ధారణ అయింది.
న్యూరోసర్జన్ కావాలన్న లక్ష్యం
చదువుతో పాటు హ్యాకథాన్‌లు, చెస్, ఏవియేషన్ వంటి రంగాల్లోనూ అశ్రిత్ ఆసక్తి చూపుతున్నాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెడిసిన్, కంప్యూటర్ సైన్స్, పరిశోధనలపై కూడా ఆసక్తి ఉన్నట్లు అతని పబ్లిక్ ప్రొఫైల్‌లో పేర్కొన్నాడు.
భవిష్యత్తులో న్యూరోసర్జన్‌గా ఎదగాలన్నది తన లక్ష్యమని అశ్రిత్ తెలిపాడు. చిన్న వయసులోనే SATలో పర్ఫెక్ట్ స్కోర్ సాధించడం ద్వారా తెలుగు విద్యార్థుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.
