మేము కూటమిలో ఉన్నామా? వైసీపీలో ఉన్నామా? బెల్లంకొండ ఘటనపై జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె ఆగ్రహం!
1 min read

మేము కూటమిలో ఉన్నామా? వైసీపీలో ఉన్నామా? బెల్లంకొండ ఘటనపై జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె ఆగ్రహం!

పల్నాడు జిల్లా | పెదకూరపాడు నియోజకవర్గం

పెదకూరపాడు నియోజకవర్గంలోని బెల్లంకొండలో జనసేన పార్టీకి చెందిన ఎంపీటీసీ సభ్యులు, అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులపై దాడులు జరిగాయంటూ జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేన నాయకులపై ఇలాంటి ఘటనలు జరగడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.

రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా పనిచేస్తుంటే, బెల్లంకొండలో మాత్రం జనసేనకు స్థానం లేనట్లుగా వ్యవహరిస్తున్నారని గాదె విమర్శించారు. “మేము కూటమిలో ఉన్నామా? లేక వైసీపీలో ఉన్నామా?” అంటూ ఆయన ప్రశ్నించారు.

రాష్ట్ర స్థాయిలో మూడు పార్టీలు కలిసి పనిచేయాలని చెబుతుంటే, క్షేత్రస్థాయిలో జనసేన అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులపై పోలీసుల సమక్షంలో దాడులు జరగడం సిగ్గుచేటని ఆయన వ్యాఖ్యానించారు. తాము కూటమి ధర్మాన్ని గౌరవిస్తూ శాంతియుతంగా వ్యవహరిస్తున్నామని, తమ పార్టీ నాయకులపై దాడులు జరిగితే సహించబోమని హెచ్చరించారు.

మహిళలకు రాష్ట్రంలో ఇలాంటి రక్షణ కల్పిస్తున్నారా? అని గాదె ప్రశ్నించారు. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న సమయంలోనే ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

నామినేషన్ కేంద్రంలో మహిళపై జరిగిన దాడికి సంబంధించిన వీడియోలు స్థానిక ఎమ్మెల్యే, పల్నాడు జిల్లా ఎస్పీ దృష్టికి వెళ్లాయని పేర్కొంటూ, అధికారులు వెంటనే స్పందించి బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

“జనసేన అభ్యర్థులపై, వారి కుటుంబ సభ్యులపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోం. జిల్లా అధ్యక్షుడిగా మా నాయకులకు అండగా నిలబడేందుకు బెల్లంకొండలోనైనా, మరెక్కడైనా వస్తా. మా నాయకులను బెదిరించే ధోరణిని సహించేది లేదు” అంటూ టీడీపీ బెల్లంకొండ మండల నాయకులను గాదె హెచ్చరించారు.

దాడులకు సంబంధించి బాధ్యులపై హత్యాయత్నం, మహిళలపై దాడి వంటి ఆరోపణలకు అనుగుణంగా కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఆయన పల్నాడు ఎస్పీని కోరారు. అధికారులు తక్షణమే స్పందించకపోతే జిల్లా ఎస్పీ కార్యాలయం వద్ద ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

బెల్లంకొండలో చోటుచేసుకున్నట్లు ఆరోపిస్తున్న ఈ ఘటనపై కూటమి పార్టీల నాయకులు, పోలీసు అధికారులు ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *