100% ఫలితాల కోసం కొత్త ప్లాన్.. అధికారులకు మంత్రి ఆదేశాలు
1 min read

100% ఫలితాల కోసం కొత్త ప్లాన్.. అధికారులకు మంత్రి ఆదేశాలు

, ఇంటర్ ఫలితాలపై ప్రత్యేక ఫోకస్.. 100% ఉత్తీర్ణతే లక్ష్యం

తిరుపతి, అక్టోబర్ 4: సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థుల విద్యా ప్రగతిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అధికారులను ఆదేశించారు. పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించేలా ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని సూచించారు.

తిరుపతిలో చిత్తూరు, అన్నమయ్య జిల్లాలకు చెందిన సాంఘిక సంక్షేమ శాఖతో పాటు స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖల అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఆయా శాఖల ద్వారా అమలవుతున్న కార్యక్రమాలు, విద్యార్థుల సంక్షేమం, వసతి గృహాల్లోని సౌకర్యాలపై సమీక్షించారు.

వసతి గృహాల్లోని ప్రతి విద్యార్థికి ప్రభుత్వం అందిస్తున్న స్పోర్ట్స్ డ్రెస్, నైట్ డ్రెస్, షూస్, టవల్స్ వంటి అవసరమైన వస్తువులు తప్పనిసరిగా అందేలా చూడాలని మంత్రి సూచించారు. విద్యార్థుల చదువును నిరంతరం పర్యవేక్షిస్తూ, అవసరమైన చోట అదనపు సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు.

విద్యార్థుల ఆరోగ్యం, భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని మంత్రి స్పష్టం చేశారు. హాస్టళ్లలో పరిశుభ్రత, నాణ్యమైన ఆహారం, తాగునీరు, మౌలిక వసతులను అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు.

కోటలోని ఎక్సలెన్స్ సెంటర్‌పై ప్రత్యేక దృష్టి పెట్టి, విద్యార్థులకు మెరుగైన విద్యా అవకాశాలు అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.

అదేవిధంగా ట్రాన్స్‌జెండర్ల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. వారి కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించి, అవసరమైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.

సంక్షేమ శాఖల ద్వారా అమలవుతున్న పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా శాఖల మధ్య సమన్వయం పెంచాలని మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి సూచించారు. విద్యార్థుల విద్య, ఆరోగ్యం, భద్రతతో పాటు సంక్షేమ కార్యక్రమాల అమలులో అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *