క్యాండిల్ ర్యాలీతో భారీ అవగాహన.. ‘త్రిశూల్’పై సీఐ కొండలరావు కీలక వ్యాఖ్యలు
1 min read

క్యాండిల్ ర్యాలీతో భారీ అవగాహన.. ‘త్రిశూల్’పై సీఐ కొండలరావు కీలక వ్యాఖ్యలు

డ్రగ్స్ నిర్మూలన.. మహిళల భద్రత.. రోడ్డు భద్రతే లక్ష్యం

‘త్రిశూల్’ వ్యూహంతో ప్రజల్లో చైతన్యం.. క్యాండిల్ ర్యాలీ నిర్వహించిన కొత్తపేట పోలీసులు

విజయవాడలో ప్రజా భద్రతకు పెద్దపీట వేస్తూ కొత్తపేట పోలీసులు ‘త్రిశూల్’ వ్యూహంతో ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. డ్రగ్స్ నిర్మూలన, మహిళల భద్రత, రోడ్డు భద్రత అనే మూడు ప్రధాన అంశాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే లక్ష్యంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలో కొత్తపేట సీఐ కొండలరావు ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐలు, సిబ్బందితో పాటు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు. V.G. చౌక్ నుంచి ప్రారంభమైన క్యాండిల్ ర్యాలీ రమణయ్య కూల్ డ్రింక్ సెంటర్ వరకు కొనసాగింది.

అనంతరం ‘త్రిశూల్’ వ్యూహం ప్రధాన ఉద్దేశాలు, లక్ష్యాలపై సీఐ కొండలరావు ప్రజలకు అవగాహన కల్పించారు. డ్రగ్స్ నిర్మూలన, మహిళల భద్రత, రోడ్డు భద్రతను ‘త్రిశూల్’ వ్యూహంలో ప్రధాన అంశాలుగా పేర్కొన్నారు.

యువత డ్రగ్స్‌కు పూర్తిగా దూరంగా ఉండాలని సీఐ కొండలరావు సూచించారు. డ్రగ్స్‌కు అలవాటు పడటం వల్ల యువత తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని హెచ్చరించారు. డ్రగ్స్ వినియోగం లేదా విక్రయాలకు సంబంధించిన సమాచారం పోలీసులకు అందించాలని, సమాచారం అందించే వారికి నిబంధనల ప్రకారం పారితోషికం అందజేస్తామని తెలిపారు.

అదేవిధంగా మహిళల పట్ల ప్రతి ఒక్కరూ గౌరవభావంతో మెలగాలని, మహిళల భద్రత విషయంలో సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సీఐ సూచించారు. మహిళలను గౌరవించడం, వారికి భద్రత కల్పించడంలో సహకరించడం ద్వారా సురక్షితమైన సమాజాన్ని నిర్మించవచ్చని పేర్కొన్నారు.

రోడ్డు భద్రతపై కూడా ప్రజలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆయన సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించే వారు సీట్‌బెల్ట్ ధరించాలని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం వల్ల ప్రమాదాలు చోటుచేసుకుని అనేక కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నాయని పేర్కొన్నారు.

డ్రగ్స్‌కు దూరంగా ఉండటం, మహిళల భద్రతకు సహకరించడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా సురక్షితమైన సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సీఐ కొండలరావు పిలుపునిచ్చారు. ప్రజా భద్రత కోసం పోలీసులు చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *