నాని ‘ది ప్యారడైజ్’పై కేటీఆర్ ప్రశంసలు.. శంకరన్న పాత్రపై ఆసక్తికర వ్యాఖ్యలు!
హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ సుదర్శన్ థియేటర్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాని నటించిన ‘ది ప్యారడైజ్’ సినిమాను వీక్షించారు. పార్టీ నేతలతో కలిసి సినిమా చూసిన ఆయన.. చాలా ఏళ్ల తర్వాత థియేటర్‌లో సినిమా చూశానని ముందుగానే సోషల్ మీడియాలో వెల్లడించారు.
సినిమా అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ ‘ది ప్యారడైజ్’ అద్భుతంగా ఉందని ప్రశంసించారు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ప్రతిభను, నాని నటనను ప్రత్యేకంగా కొనియాడారు. సినిమాలోని అస్తిత్వ పోరాటం తనను ఆకట్టుకుందని తెలిపారు.
ఇక సినిమాలోని ‘శంకరన్న’ పాత్రపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తించాయి. ఆ పాత్రకు స్ఫూర్తి ఎవరో ప్రేక్షకులకు తెలుసంటూ ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ నేల, తెలంగాణ యాస, తెలంగాణ భాషకు ప్రాధాన్యతనిస్తూ తెరకెక్కించిన ఈ చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
